[సుమతీ శతకం] ᐈ Sumati Satakam Lyrics In Telugu Pdf

Sumati Satakam Lyrics In Telugu

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥ 1 ॥

అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ ॥ 2 ॥

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ ॥ 3 ॥

అడియాస కొలువు గొలువకు,
గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ ॥ 4 ॥

అధరము గదలియు, గదలక
మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ
అధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ ॥ 5 ॥

అప్పు కొని చేయు విభవము,
ముప్పున బృఆయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ ॥ 6 ॥

అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ ॥ 7 ॥

అల్లుని మంచితనంబు,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ ॥ 8 ॥

ఆకొన్న కూడె యమృతము,
తాకొంచక నిచ్చువా~ండె దాత ధరిత్రిన్,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ ॥ 9 ॥

ఆకలి యుడుగని కడుపును,
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాకొన్న నూతి యుదకము,
మేకల పాడియును రోత మేదిని సుమతీ ॥ 10 ॥

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ ॥ 11 ॥

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ ॥ 12 ॥

ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ ॥ 13 ॥

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ? ॥ 14 ॥

ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచు గడకు జనకుర సుమతీ ॥ 15 ॥

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ ॥ 16 ॥

ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ ॥ 17 ॥

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ ॥ 18 ॥

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ ॥ 19 ॥

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ ॥ 20 ॥

ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ ॥ 21 ॥

ఒక యూరికి నొక కరణము,
నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్,
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ ॥ 22 ॥

ఒరు నాత్మ దలచు సతి విడు,
మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ,
వెఱ పెఱుగని భటునేలకు,
తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ ॥ 23 ॥

ఒల్లని సతి నొల్లని పతి,
నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే
గొల్లండు, కాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ ॥ 24 ॥

ఓడల బండ్లును వచ్చును,
ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్,
ఓడలు బండ్లును వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ ॥ 25 ॥

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియు
బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ ॥ 26 ॥

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ ॥ 27 ॥

కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ ॥ 28 ॥

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ ॥ 29 ॥

కరణము గరణము నమ్మిన
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ,
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ ॥ 30 ॥

కరణముల ననుసరింపక
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ
యిరుసున కందెన బెట్టక
పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ ॥ 31 ॥

కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్,
ధర దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ ॥ 32 ॥

కసుగాయ గఱచి చూచిన
మసలక పస యొగరు రాక మధురంబగునా,
పస గలుగు యువతులుండగ
పసి బాలల బొందువాడు పశువుర సుమతీ ॥ 33 ॥

కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్,
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ ॥ 34 ॥

కాదు సుమీ దుస్సంగతి,
పోదుసుమీ “కీర్తి” కాంత పొందిన పిదపన్,
వాదు సుమీ యప్పిచ్చుట,
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ ॥ 35 ॥

కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్
బ్రేమమున జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ ॥ 36 ॥

కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ ॥ 37 ॥

కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ ॥ 38 ॥

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ ॥ 39 ॥

కొంచెపు నరు సంగతిచే
నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ ॥ 40 ॥

కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ ॥ 41 ॥

కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ ॥ 42 ॥

కోమలి విశ్వాసంబును,
బాములతో జెలిమి, యన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ ॥ 43 ॥

గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో,
గడ నుడుగు మగని జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ ॥ 44 ॥

చింతింపకు కడచిన పని,
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,
నంతఃపుర కాంతలతో
మంతనముల మాను మిదియె మతముర సుమతీ ॥ 45 ॥

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ ॥ 46 ॥

చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ ॥ 47 ॥

చేతులకు దొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ ॥ 48 ॥

తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే,
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ ॥ 49 ॥

తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ ॥ 50 ॥

తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ ॥ 51 ॥

తన కలిమి యింద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్,
దన చావు జల ప్రళయము,
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ ॥ 52 ॥

తన వారు లేని చోటను,
జనమించుక లేని చోట, జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ ॥ 53 ॥

తమలము వేయని నోరును,
విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,
గమలములు లేని కొలకును,
హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ ॥ 54 ॥

తలనుండు విషము ఫణికిని,
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్,
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ ॥ 55 ॥

తలపొడుగు ధనము పోసిన
వెలయాలికి నిజము లేదు వివరింపంగా
దల దడివి బాస జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ ॥ 56 ॥

తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
గులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ ॥ 57 ॥

తాను భుజింపని యర్థము
మానవ పతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ ॥ 58 ॥

దగ్గఱ కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి దా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ ॥ 59 ॥

ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్,
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ ॥ 60 ॥

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ ॥ 61 ॥

నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ ॥ 62 ॥

నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ ॥ 63 ॥

నయమున బాలుం ద్రావరు,
భయమునను విషమ్మునైన భక్షింతురుగా,
నయమెంత దోషకారియొ,
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ ॥ 64 ॥

నరపతులు మేఱ దప్పిన,
దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,
గరణము వైదికుడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ ॥ 65 ॥

నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ ॥ 66 ॥

నవ్వకుమీ సభ లోపల,
నవ్వకుమీ తల్లి, దండ్రి, నాథుల తోడన్,
నవ్వకుమీ పరసతితో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ ॥ 67 ॥

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ ॥ 68 ॥

పగవల దెవ్వరి తోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ ॥ 69 ॥

పతికడకు, దన్ను గూరిన
సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్,
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ ॥ 70 ॥

పనిచేయునెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనభుక్తి యెడల దల్లియు,
నన్ దన కులకాంత యుండు నగురా సుమతీ ॥ 71 ॥

పరనారీ సోదరుడై,
పరధనముల కాసపడక, పరులకు హితుడై,
పరులు దను బొగడ నెగడక,
పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ ॥ 72 ॥

పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకు, బరునెంచకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ ॥ 73 ॥

పరసతుల గోష్ఠి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్,
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ ॥ 74 ॥

పరులకు నిష్టము సెప్పకు,
పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్,
బరు గదిసిన సతి గవయకు,
మెఱిగియు బిరుసైన హయము లెక్కకు సుమతీ ॥ 75 ॥

పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలి బెంపకు,
నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ ॥ 76 ॥

పలు దోమి సేయు విడియము,
తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్
బొల యలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ ॥ 77 ॥

పాటెఱుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేటెత్త జేయు చెలిమియు,
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ ॥ 78 ॥

పాలను గలసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
పాల చవి జెఱచు గావున
పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ ॥ 79 ॥

పాలసునకైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ ॥ 80 ॥

పిలువని పనులకు బోవుట,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరంటంబును,
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ ॥ 81 ॥

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ॥ 82 ॥

పురికిని ప్రాణము గోమటి,
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్,
గరికిని ప్రాణము తొండము,
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ ॥ 83 ॥

పులి పాలు దెచ్చి యిచ్చిన,
నలవడగా గుండె గోసి యఱచే నిడినన్,
దలపొడుగు ధనము బోసిన,
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ ॥ 84 ॥

పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్థములున్,
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ ॥ 85 ॥

పొరుగున బగవాడుండిన,
నిరవొందక వ్రాతకాడె యేలిక యైనన్,
ధర గాపు కొండెమాడిన,
గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ ॥ 86 ॥

బంగారు కుదువ బెట్టకు,
సంగరమున బాఱిపోకు సరసుడవైతే,
నంగడి వెచ్చము వాడకు,
వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ ॥ 87 ॥

బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా,
బలవంత మైన సర్పము
చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ ॥ 88 ॥

మదినొకని వలచి యుండగ
మదిచెడి యొక క్రూర విటుడు మానక తిరుగున్
బది చిలుక పిల్లి పట్టిన
జదువునె యాపంజరమున జగతిని సుమతీ ॥ 89 ॥

మండల పతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
గొండంత మదపు టేనుగు
తొండము లేకుండినట్లు దోచుర సుమతీ ॥ 90 ॥

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ ॥ 91 ॥

మాటకు బ్రాణము సత్యము,
కోటకు బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము,
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ ॥ 92 ॥

మానధను డాత్మధృతి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ ॥ 93 ॥

మేలెంచని మాలిన్యుని,
మాలను, మొగసాలెవాని, మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసి పోవుగాని నెగడదు సుమతీ ॥ 94 ॥

రాపొమ్మని పిలువని యా
భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ ॥ 95 ॥

రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో,
గోపించు రాజు గొల్వకు,
పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ ॥ 96 ॥

లావిగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రానంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ ॥ 97 ॥

వఱదైన చేను దున్నకు,
కఱవైనను బంధుజనుల కడ కేగకుమీ,
పరులకు మర్మము చెప్పకు,
పిరికికి దళవాయి తనము పెట్టకు సుమతీ ॥ 98 ॥

వరిపంట లేని యూరును,
దొర యుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను పతి లేని గృహమును
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ ॥ 99 ॥

వినదగు నెవ్వరు జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప దగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ ॥ 100 ॥

వీడెము సేయని నోరును,
జేడెల యధరామృతంబు సేయని నోరున్,
పాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ ॥ 101 ॥

వెలయాలి వలన గూరిమి
గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా,
బలువురు నడచెడు తెరువున
మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ ॥ 102 ॥

వెలయాలు చేయు బాసలు,
వెలయగ మొగసాల బొందు వెలమల చెలిమిన్,
గలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ ॥ 103 ॥

వేసరపు జాతి గానీ,
వీసము దా జేయనట్టి వీరిడి గానీ,
దాసి కొడుకైన గానీ,
కాసులు గల వాడె రాజు గదరా సుమతీ ॥ 104 ॥

శుభముల పొందని చదువును,
నభినయముగ రాగరసము నందని పాటల్,
గుభ గుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ ॥ 105 ॥

సరసము విరసము కొఱకే,
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే,
పెరుగుట విరుగుట కొఱకే,
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ ॥ 106 ॥

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్,
సిరి తా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ ॥ 107 ॥

స్త్రీల యెడ వాదులాడకు,
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ,
మేలైన గుణము విడువకు,
మేలిన పతి నింద సేయ కెన్నడు సుమతీ ॥ 108 ॥

********

Leave a Comment